topbella

Wednesday, April 20, 2011

దేవీప్రియ అమ్మచెట్టు


                                         ^చీకోలు సుందరయ్య..

మరణించిన తర్వాత వాడు
మరింత అందంగా కనిపిస్తున్నాడు
కళ్లు మూసిన తర్వాత వాడు
కాంతులన్నీ చూస్తున్నాడు
కాళ్లుచేతులు విరిగినాక వాడు
నాదగ్గిరకు పదే పదే పరిగెత్తుకు వస్తున్నాడు
దూది వాడి ముక్కురంధ్రాలను మూశాక వాడు
లోక  పరిమళాలన్నింటినీ పీలుస్తున్నాడు
మట్టిబెడ్డల కింద ఆరడుగుల పొడవున
పడుకొన్నట్టు కనిపిస్తున్నాడు కాని
మా తమ్ముడు ఇప్పటికీ
మా అమ్మ  పొట్టలో ఈత కొడుతూనే ఉన్నాడు

ఏమనిపిస్తోంది? కళ్లు చెమరుస్తున్నాయి కదూ? అవును. ఆయన ఏది రాసిన అంతే. కవిత్వం ఎన్నో వాదాలుగా విడిపోయింది కాని, ఆయనకు మాత్రం అది హృదయవాదమే. ఆయన కవిత్వంలో పుట్టలేదు కాని పుట్టినప్పటినుండి కవిత్వమై జీవిస్తున్నాడు. రుతువులతో  పనిలేని కవితల పూతచెట్టు 'అమ్మ చెట్టు' నీ, స్వప్నాల సముద్ర రాశి 'నీటిపుట్ట'నీ,  'తుఫాను తుమ్మెద'నీ, ఇంకా ఇటువంటి సాంద్రమైన, సొగసైన అభివ్యక్తులతో మూడు కవితా సంపుటాలను ఒకటిగా కలిపి అందించిన కవి .. దేవీప్రియ..

కె.ఎస్.వై పతంజలి అనే కథల మాంత్రికుడు దేవీప్రియని 'కవన మహాశిల్పి' అంటారు. .  ఆకలికి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయో, అడిగింది అమ్మ ఇవ్వలేదని అలిగి అలసిపోయో, నిద్రలోకి జారిపోయిన పిల్లల బుగ్గలమీద  ఆరీ ఆరని కన్నీటి చారకలుంటాయే... అలాగుంటాయి దేవీప్రియ కవితలు.. పంటచేలు కోస్తున్నప్పుడో, కమ్మరం పని చేస్తున్నప్పుడో, చూపుడు వేలు కోసుకుపోయి,  చితికిపోయినప్పుడు ఉబికివచ్చిన నెత్తుటి చుక్కల్లాగుంటాయి దేవీప్రియ కవితలు.జేబురుమాలంత పాలమబ్బు వెనకాల నిశ్శబ్ధంగా కూర్చుని లోకాన్ని చూస్తున్న చిన్నారిచుక్కల్లాగుంటాయవి. బొటనవేలంత పిట్టకళ్లలో రగులుతున్న కోపాగ్ని శిఖలవలె కూడా  ఉంటాయవి. పాలు తాగుతూ అమ్మగుండెల పైనే నిదురవోయిన పసిపాప పెదాలకు అంటుకుని స్వచ్చంగా మెరిసే అమ్మపాల చుక్కలవలె కూడా ఉంటాయి దేవీప్రియ కవితలు.. ఈ మాటల ద్వారా పతంజలి దేవీప్రియ కవితాత్మని ఎంతో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదివితే అంతే ఆర్ధ్రంగా ప్రతిస్పందిస్తారు.

"అమ్మచెట్టు" కావ్యాల్ని తొలిసారి 1979 లో అచ్చు వేశారు. ఇందులో తొలికవిత "అడివి". దేవీప్రియ తనని గూర్చో, తన కవిత తత్వాన్ని గూర్చో, ఎప్పుడు ఎక్కడ చెప్పవలసి వచ్చినా, ఈ  కవితను ఉదహరిస్తారు..."అడివి"ని సంబోధిస్తూ...

రేపటి దేశానికి
ఈనాటి తల్లివి నువ్వు
రేపటి ఆకాశానికి
ఈనాడే పూచిన సూర్యపుష్పానివి నువ్వు
అడివీ, నీ పేరు వింటేనే 
నాకు పూనకం వస్తుంది

ఇలా సాగే కవితలో చిట్టచివర...

ఏదో ఒకనాడు
నేను నీ సాయమే కోరతాను అంటారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ్ముడిమీద ఆయన రాసిన స్మృతి కవిత (ఎలిజీ) వంటిది  తెలుగుకవిత్వంలో ఇంతవరకు రాలేదంటే ఆశ్చర్యం లేదు. అందులో ఉన్న గాఢత, కాల్పనికత, భావుకత, శబ్దచిత్రనంప్రగాడమైన ప్రేమాభివ్యక్తి ఇతర కవుల్లో కనిపించదు. అమ్మ మీద రాసినా, రి మీద రాసినా, తమ్ముడి మీద రాసినా, అడివి మీద రాసినా ఆయన కవిత్వంలో అంతర్లీనంగా లాలిత్యం ఉంటుంది. ఒక తడి ఉంటుంది.  అదే ఆయన కౌశలం. మెదడు చెట్టుకు
రుతువులతో యేం పని?
అది సతత  హరితం
అహర్నిశలూ
అక్షరాలనీ, సప్తస్వరాలనీ
పూస్తుంది.
రాగబంధాల్నీ, రంగుల్నీ
రాలుస్తుంది.

ఇలా " అమ్మ చెట్టు" తెలుగు కవిత్వ వనంలో పటిష్టమైన కొమ్మల భుజాలతో, అసంఖ్యాకమైన ఆకుల కళ్లతో విశాలంగా విస్తరించుకుని ఉన్న నీడల చెట్టు. "నీటిపుట్ట" తొలిసారి 1990 లో అచ్చయింది.

మద్రాసు పిల్ల పాదాల మీద
జీరాడుతున్న సిల్కు పరికిణీలా ఉంది సముద్రం

బంగాళాఖాతం దేవీప్రియకి అలా కనిపించిందన్నమాట.  నీటిపుట్ట దేవీప్రియ ఎనభైలలో రాసిన కవితల సంపుటి. ఇందులో అనేక వస్తువుల మధ్య దేవీప్రియ తన కవిత్వ విధాన ప్రకటన చేశారు.

నాకు రెండు విధులున్నాయి
నాలుక మీద కవిత్వం
తల మీద దారిధ్ర్యం
కవిత్వం నిత్యనిబద్ధం
దారిధ్ర్యం విముక్తి యుద్ధం.

నిజమే దేవీప్రియ అబద్ధలు రాయలేదు. ఎవర్నో మెప్పించటానికి రాయలేదు. అనంతమైన వైవిధ్యాన్నీ, విస్తృతినీ సాధించినా మిడిసి పడలేదు.. గొప్పలు చెప్పుకోలేదు.. "నీటిపుట్ట"లో అనంతమైన కవితారాశిని పోగు చేశారు.

ఒంటరిగా ఉండి కూడా
నలుగురివాడి నవుతాను

అన్నట్లుగానే ఆయన నలుగురివాడిగానే జీవిస్తున్నాడనడంలో సందేహం లేదు. 1999లో వచ్చిన కవితా సంపుటి "తుఫాను తుమ్మెద" కిల్లారి, లాతూర్‌లలో భూకంపం వచ్చినప్పుడు "ధరణి, ధరిత్రి, భూమి" అనే కవిత రాశారు. అదే ఇందులో తొలికవిత.
చాలా పెద్దదైన ఈ కవితలో చివరి పంక్తులు ...
మధ్య మధ్యలో మతిభ్రమంచే
మమతానురాగాల మాతృమూర్తి

భూమిని ఇలా వర్ణించడం ఎవరికి సాధ్యమైంది?దేవీప్రియ కవిత్వంలో మొరటుదనం, అశ్లీలత, బూతులు వంటివి ఉండవు. అక్షర రమ్యత్వంతో కూడిన  ఉత్తమ కవిత్వమే  ఉంటుంది. అమ్మచెట్టు, నీతి పుట్ట, తుఫాను తుమ్మెద .. ఈ మూడింటినీ ఒక్కసారి చదివితే వస్తుపరంగా, శబ్దపరంగా ఆయన ఎంత పరిణతి సాధించింది అవగతమవుతుంది. నినాదాలే కవిత్వంగా చెలామణి అవుతున్నా కాలంలో స్వచ్చమైన కవిత్వం, వస్తువు ఏదైనా హృదయాన్ని తాకే కవిత్వం చదవాలనుకునేవారు "దేవీప్రియ కవిత్వం"  చదవాలి. ఉర్దూ కవిత్వంలో, హిందుస్తానీ సంగీతంలో  ఉన్న మార్మికతనీ దేవీప్రియ తెలుగు కవిత్వంలో చూపారు.  దేవీప్రియకి భాషా జ్ఞానం, లయజ్ఞానం, అలంకార జ్ఞానం అన్నీ  ఉన్నాయి.. ఆయనకి అన్నీ తెలుసు..

"కొత్త ఆయుధం కోసం
పాత రాతిని అరగదీస్తున్న చప్పుళ్లు
కాగితాల మీద రాలుతోన్న
అక్షరాల కన్నీటి సడి
అన్నీ వినిపిస్తున్నాయి నాకు"

"తుఫాను తుమ్మెద" లో ఆయన "అమ్మ పాడిన పాట"ఉంది..
అమ్మా
నీ పాట మెట్ల మీద నుంచే
ఆకాశం నేలకు దిగి వచ్చిందమ్మా
భూగోళమంతా సంకోచించి
నీ కనుకొలకల్లో నీటి బిందువై
నిలిచిందమ్మా..

ఎవరు రాశారిలా? అందుకే పతంజలి అంటారు..  "తుఫాను తుమ్మెద ఒక మహాశిల్పం.  86 తీగల వీణ, 86 అడుగుల చిత్తరువు, 86 అంతస్థుల భవంతి, 86 కత్తిపోట్లు  తిని నెత్తురోడుతున్న దేహం.. వెరసి  దేవీప్రియ మాత్రం 312 తీగల వీణ. తెలుగు కవిత్వాన్ని ఎవరికైనా బహుమతిగా పంపాలంటే "దేవీప్రియ" ది ఏదైనా సరే .. పంపండి.  ఆ బహుమతికి విలువ పెరుగుతుంది.

 దేవీప్రియ కవిత్వం...దేవి 30 ఆహ్వాన సంఘం ప్రచురణ..2002 ..పుటలు.. 312..వెల .. రూ.150..అన్ని పుస్తక కేంద్రాలలో.. 

(అమ్మను గుర్తుచేసే అమ్మ చెట్టుకి వందనాలతో...)

నేను...

My photo
కేశవ్... ప్రసారభాష పుస్తక రచయిత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్టు పురస్కారగ్రహీత. ప్రస్తుతం సిక్స్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్...