topbella

Monday, January 17, 2011

'అమ్మ' గురించి కమ్మని మాట!

'అమ్మ'పై కమ్మని కవిత్వం మాతృమూర్తికి అక్షరాకృతి 

                                                                                           -డా|| కె.వి.రమణాచారి, ఐఎఎస్




అమ్మ అమ్మయే. అమ్మకు సాటి ఎవరూ రారు. అమ్మపై, అమ్మప్రేమపై ఎన్నో కవితలు, గేయాలు ప్రచురింపబడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మను దర్శిస్తారు. తరతరాలుగా తల్లిప్రేమ వర్ణింపబడు తున్నా, ఇంకెన్ని తరాలైనా వర్ణింపబడగల్గిన తరగని గని తల్లిప్రేమ. అందుకే జోస్యం విద్యాసాగర్తన మనస్సుకు నచ్చిన రీతిలో అమ్మను దర్శించానన్నారు. 'అమ్మగతించెనన్న కార్చిచ్చు దహించగా కలత చెంది తపించిన తన మనస్సులో హెచ్చిన శోక బాష్పచయ పెన్నిధికిచ్చిన రూప'మన్నాడు. తన పంచప్రాణాల్ని తన కోసం పంచటానికి ఎప్పటి కప్పుడు నా కపుపాపల పంచనుంటూ తాను తప్ప వేరే ప్రపంచమంటూ ఏమీ లేని తన అమ్మ గూర్చి పంచ పాదాల్లో ప్రతి పద్యము కుదిరేలా అమ్మ ప్రేమామృతాస్వాద సుందర భావోద్వేగంతో కావ్యాన్ని రచించాడు.


ఇది ఒక అమ్మ ఆత్మ కథ! అమ్మ ఎదలో చివురులెత్తిన ప్రేమ. మొక్కయై, మ్రానై విస్తరించిన విధాన్ని విశదీకరించాడు. అందుకే భాష పట్టింపు లేదు. వ్యాకరణ నియమాలు, ఛందోవిన్యాసాలు మందునకైన కన్పడి విందులో. ఎదలో జెలలా పుట్టి స్రవంతిలా సాగిన 'అమ్మభాష'నే వాడా డు కావ్యంలో. అమ్మకు బాసరాదు. వ్యావహారికం తప్ప. అమ్మ మనస్సును తన గుండెలో ప్రతిష్ఠించుకొని ఎదలో సూటిగా, సున్నితంగా ప్రతిబింబించేలా సులభశైలిలో వ్యావహారిక భాషలో కవితాధారను సాగించి ఆదర్శంగా నిలిచాడు. అమ్మ గూర్చి అందరికీ సదభిప్రాయమే వుంటుంది. ప్రేమ ఉంటుంది. అనురాగం ఉంటుంది. హృదంతరాలలో తీయని కోకిలారవపు తేనెలా జల్లు లుంటాయి. తప్ప వేరే అభి ప్రాయ ముంటుంది? కట్టి పడేసాడు కవి 'సహృదయత'ను స్వాగతిస్తూ.


ఒక బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి పునర్జన్మ లాంటిది. తాను అనుభవిం చిన వేదనంతా మరిచిపోయి బిడ్డ పుట్టగానే థవకోటి సుమాలు విరిసినట్లు అనుభూతి పొందు తుంది. స్త్రీ 'అమ్మ'గా రూపాంతరం చెందుతుంది. మాతృత్వం పొంగులువార పసివాణ్ణి ప్రేమగ చూచి.. తాకి పోలికలేవి యెవ్వరివి పొందెనో యేమొ యెరుంగగాని లోపాలేవి లేవు చాలంటూ తల్లి పాలను తాపెడి అమ్మ అమ్మయే! తల్లిదండ్రులు నీపోలికా? నా పోలికా? ఎవరి పోలిక వచ్చిందని అనుకోవడం సహజం. తల్లి మాత్రం ఎవరి పోలికైనా పరవాలేదు. లోపా లేవీ లేవని తృప్తి పొందుతుంది. (పు.13) అమ్మ మాత్రమే చనుబాలు అందిస్తుంది. కొందరు ఆడపిల్ల పుట్టితే కినుకవహిస్తారు. మగపిల్లవాడనగానే ఎగిరి గంతేస్తారు. అమ్మ మాత్రం 'లోపలి పేగుబంధమెదలో మెదిలే మమతానుబంధంతో' పసికూనయైన నొకటే అని పలుకడం లోకసహజం. సహజమయిన విషయాన్నే జోస్యం వారు ఉత్పల మాలావృత్తంలో ఊహించారు. పాప కాని బాబు కాని నవ్వితే అమ్మకు ఒక పండుగ, బోర్ల పడ్డనాడు ఇరుగుపొరుగు వారే కాక ఎవ్వరు కన్పించినా అదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ప్రాకుతున్నప్పుడు నివ్వెరపోయి గంతులేస్తుంది. నిల్చుప్రయత్నం అమ్మకు మహదానందం కల్గిస్తుంది. తప్పటడుగులు వేస్తూ పడ్డ బాబును చూస్తే ఎవ్వరో పేగు పట్టుకొని ఈడ్చిలాగిన యట్లు బాధపడుతుంది. పుట్టిన పాప తనను 'అమ్మా' యని మొట్టమొదటి సారిగా పిల్చినప్పుడు పులకాంకురముల్మెయినిండగా లోకమందమ్మ తనొక్కతేయయినట్లు నిండుగా నవ్వుకుంటుంది అమ్మ.


కన్నులు కొంచెమెర్రబడి
గట్టిగ తుమ్మిన..లేక దగ్గినన్
చిన్నికి జబ్బుచేసునని
చిందులు తొక్కును... కాలుసేతులే
మన్నను వెచ్చనాను అను
మానముతో స్పృశియించి చూచిలే
దన్న నిజమ్మెరింగియు ని
దానము చెందక తృప్తిలేక వెం
కన్నకు మొక్కివే ముడుపు కట్టే... (పుట.17)


అమ్మ అమాయకత్వాన్ని పద్యంలో రచించినా వచనానికి దగ్గరగా తీసుకొచ్చాడు కవి. అర్థం స్పష్టం. పసి చేష్టలు ఎంత చీదర కల్గిస్తున్నా సర్దుకు పోయేది అమ్మ. కథలూ, కాకరకాలూ ఎప్పటికప్పుడు అల్లుతూ తీపి కబుర్లు చెప్పి బువ్వ తినపించి ఆశీర్వదించేది అమ్మ. కోప్పడినా, తిట్టినా, మొట్టినా, గోముగా దువ్వినా, ఆడించినా, ఏడ్చించినా, లాలించినా, జోలపాడినా నామాటను విందువ అనుచు పసితనం నుండి మంచిని నేర్పేది అమ్మ.

'అమ్మ బొట్టు' గురించి హృద్యమైన వర్ణన క్రింది పద్యంలో చూద్దాం.

రామరి మెల్లమెల్ల ఇటు
రా అని పక్కకు పిల్చి... నింగిలో
సోముని చూపి... చందురుని
చూడుము తెల్లగ గుండుగా... సరే
ఏమనిపించు నాన్న వెలి
గే నెల రాజును చూచినంతనే
నీ మది.. కన్న... తల్లి గని
నింగిని చూచుచు 'అమ్మబొట్ట'నన్
మురిపెంపు పోలికకు
అల్లన నవ్వెడు అమ్మ అమ్మయే! (పుట.25)


పసివాడిని ఓదార్చడానికో, ఆడించడానికో, ఉల్లాసపరచడానికో, నింగి లోని చంద్రుణ్ణి చూపి నాన్నా! కన్నా! చంద్రుడెంత చల్లగున్నాడో, తెల్లగా వెన్నముద్దలా ఎలా వున్నాడో చూడుమని అనే తల్లులెంత మందో! అలాగే జోస్యం విద్యాసాగర్అమ్మ కూడ తెల్లగ గుండ్రంగా వుండే చంద్రుని చూడమన్నది. చూడమనటమే గాక నికేమనిపిస్తుంది నాన్నా! వెలిగే నెలరాజును చూస్తే నని అడిగింది. నింగిలోని చంద్రుణ్ణి అమ్మ నుదుటి బొట్టుగా అభివర్ణించాడట. మురిపెంపు పోలికకు మురిసిపోయి అల్లన నవ్వింది, అమ్మ అని అంటాడు కవి ఇక్కడ 'కన్న' అన్న పద ప్రయోగం విశేషం. కన్న! సంబోధాత్మకం కావచ్చు. చిన్న పిల్లల్ని తల్లులు మురిపెంగా నాన్న! కన్న! చిన్న! బంగారు కొండ! అని సంబోధించడం సహజం. 'కన్నతల్లిగని' అని చెప్పుకోవచ్చు. ఏమనిపించు నాన్న వెలిగే నెల రాజును చూచినంతనే నీ మదిక్శిఅన్న్శతల్లిని గని అని కూడ భావించవచ్చు. సహజ సుందరమై భావనా పరిపుష్టమైందీ పద్యం.


పసివాడు ఒక బొమ్మ గీస్తే ప్రసిద్ధ చిత్రకారుడైనట్లు, పాటపాడితే, త్యాగరాజు రూపుదాల్చినట్లు అందంగా పదమొక్కటెత్తుకుంటే, నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు సాహితీమూర్తులు పసివాడిలో మూర్తీభవించినట్లు పరవశిస్తుంది అమ్మ. (పుట.26) కూరలో కారమె క్కువవుతుందేమో, తను వేడుకగా సింగారించుకుంటే పసివాడికి ఇబ్బంది కల్గుతుందేమోననీ కారం తీసివేసి, సింగారాన్నీ తీసివేసి అక్కున చేర్చుకొని గుండె నిండా మమకారం నింపుకొనేది అమ్మ. మాతృత్వపు మహాత్మ్యం ఇది. ఎండలో తిరిగితే వడదెబ్బతగుల్తుందేమో ననీ, వానలో తడిస్తే పడిశెము పట్టుకుంటుందేమోననీ, జడివానలో ఆడితే జ్వరం వస్తుందేమోనని తల్లడిల్లెడునది అమ్మయే, కవి యశోద చిన్ని కృష్ణుని తాట బిగించిన దిందుకోసమేనని ప్రతి అమ్మ తలబోస్తుందని చెప్పడం తల్లిడెందన్ని తేటతెల్లం చేయడానికే ముద్దు మురిపాలను చేర్చి పాలను త్రాగిస్తుంది. పసితనం దాటి కౌమారదశ కొచ్చినా తల్లి ప్రేమలో మార్పు ఉండదు. ప్రొద్దున నిద్ర లేవకుండటం, పుస్తకం పట్టకపోవడం బడికెళ్ళలన్న బుద్ధి లేకపోవడం ఆటలపైననే దృష్టి సారించటం, చీకటి పడినా ఇంటికి చేరుకోక పోవడం! సినిమాలంటే మోజు పడటం, ఇంటిపట్టున ఉండక పోవడం, వీధుల నూరక పిచ్చికుక్కలా అదుపు తప్పి తిరగటం, పోకిరీలతో సహవాసం చేయడం పిల్లలు సాధారణంగా చేస్తుంటారు. తల్లి మందలించటం కూడ చెప్పినచో పశువైన నేర్చునే... చెప్పుచునుంటి నీకు మరి చిన్నతనమ్మును నుండి... నేర్చుకోవప్పటిదాక..., చెప్పెడి నేను జంతువునో? చెప్పిన నేర్వని నీవొ.. ఏమిటో చెప్పు మరేది కారణమొ..చిన్ని! అంటూ చదువు ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూనే కడకు చదువబ్బకడుక్కు తిందు వీవక్కడ నిక్కడంచు నాన్నగారి పరువు ప్రతిష్ఠలకు భంగం కల్గేలా ప్రవర్తించవద్దని హితవు చెప్తుంది. (పుట.33,34)


ఎంత ఎత్తు ఎదిగినా తల్లికి కొడుకే కాబట్టి ప్రతి తల్లి పిల్లతనము మాని వంశ గౌరవప్రతిష్ఠలకు భంగం కల్గకుండా కన్న తల్లి దండ్రులకు అప్రతిష్ఠ రాకుండా తన కొడుకు వ్యవహరించాలని కోరుకుంటుంది. మరీ ముఖ్యంగా 'నాన్నగారి గౌరవానికి ఎలాంటి కరువుండకూడ' దని కోరుకుంటుంది. వయస్సు ముచ్చట వయస్సులో ఉండాలన్న విషయం అందరికీ తెల్సిందే. పాతికేళ్ళ వయస్సులో, చిన్నదో, పెద్దదో కొల్వుచేరి మర్యాద కుదుర్చుకోవాలని తెల్పునది అమ్మ. పరాయి ఊరిలో కొలువులో చేరిన కొడుకు ఎన్ని ఇడుముల పాలవుతున్నాడోనని ఆరాట పడ్తుంది అమ్మ.


ఆకలి కోర్వలేడు కద../ అన్న మొకింతగ మెత్తగున్నచాల్
తాకడు చేతితో మెతుకు../తానము నాడిన గుడ్డ పిండుకో
లేక అవస్థపడ్డ నును/ లేత వయస్సుకదా... పరాయి
రే... కనునొచ్చినన్పలుక/ ... మొగమాటము వీడికెక్కువే
ఏకత నుండునో... అనుచు
నెతయుచింతిలు అమ్మ అమ్మయే! (పుట.47)


తాను పుచ్చిన పాతచెట్టుననీ, తన కొడుకు మాత్రం పూతకు వచ్చిన మావిచెట్లు... ఊరు దాటి ఎప్పుడైనను ఒక్కడుగేయలేదు... నీడను... ఉండునో... ఏం తింటాడో...
వారము కొక్క జాబు...
పదిపైసల కార్డును వ్రాయిచాలు
న్నారగ చేతి వ్రాత గని
నామది కెంతయో తృప్తి... నీ వెనా
చేరువ నిల్చి నట్లు మది
చెందును హోయిని, సంతకమ్ముచా
ల్వేరు విశేషమేమిటికి
లే యిక... వాకిటి ముందు నిల్చి బం
గారపు జాబుకై కనులు...
కాచేలా వేచి చూస్తుంటుంది. (పుట.53)


వ్రాయడానికి వారం వారం విశేషాలు ఏముంటాయమ్మా? జాబు వ్రాయాలని మరీ ప్రాధేయపడుతూంటావనే కొడుకులకు సరైన సమాధానం పై పద్యంలో చిక్కుతుంది. తల్లికి సంతకం చూస్తే చాలట వేరే విశేషాలు వ్రాయాల్సిన పనిలేదట. వాకిట నిల్చియుంటుంది. జాబురాకకై కనులు కాచేలా వేచియుంటుంది. కార్డు ముక్క చూస్తే చాలు... సంతకమ్మొకటి చూస్తే చాలు... కన్నారంగ చేతివ్రాతగాని కొడుకే తన చేరువ నిల్చినట్లు సంతృప్తి పొందుతుంది.
ఉద్యోగ బాధ్యత నిర్వర్తించే పెళ్ళీడు వచ్చిన కొడుక్కి పెళ్ళి యగు దాక అమ్మ మనస్సుకు శాంతి తక్కువే. 'అందం' గూర్చి కవి అందంగా తన అభిప్రాయాన్ని తెల్పారు. అందం ఆనందం గూర్చు సాధనం. ఆత్మకు శాంతిని గూర్చు భావనిష్యందం. మానసమ్మునకు చల్లని గంధపు పూత (పుట.63). శరీరానికి కాదు మానసమునకు పూయబడ్డ చల్లని గంధం అని పేర్కొనడంలో బాహిరమైన అందానికి విలువ లేదని గ్రహించవచ్చు. కాపురానికొచ్చిన కోడల్ని ఎలా సంభావించాలో, ఎలా సంబాళించుకోవాలో వివరిస్తూ కొడుకుతో అమ్మ అన్న మాటలు జీవిత సత్యాలు.


నిను మనసార నమ్ముకుని
నీ చెయి గట్టిగపట్టి సర్వమున్
మన కొరకై వదల్చుకొని
మానసమందున్న లక్ష ఆసలన్
కనులను కోటి కోర్కులను
కాపురముంచుకు లక్ష్మిలాగ
చ్చిన మనయింటి దేవతని
చిత్తము నెప్పుడు గుర్తు పెట్టుకో
మన దది వేరుకాదు.... (పుట.65)


ఇలాగ చెప్పే అమ్మ ఉంటే ప్రతి ఇల్లూ ఒక కోవెలగా భాసిస్తుంది. అత్తాకోడళ్ళు ఎలా వ్యవహరిస్తే కాపురంలో నిప్పులు రాలకుండా ఉంటాయో కవి తనదైన శైలిలో తెలియజేశాడీ కావ్యంలో. భార్యకు భర్తగా, అమ్మకు కొడుకుగా ఉన్నా, ఉన్నది ఒక్కడే. ఒక్కడి మనస్సు చివుక్కుమనిపించకుండా ప్రవర్తిస్తేనే సంసారం సుఖమయం. అత్తమీద కోడలు, కోడలుపై అత్త కారాలు మిరియాలు నూరుతూ చెవిలో ఇల్లుకట్టుకుందామనుకున్న కాపురంలో కొడుక్కు మిగిలేది అశాంతి. ఆవేదన, నిరాశ, విరక్తి. జీవితం మీద ఏవగింపు అందుకే క్రొత్తగా కాపురానికొచ్చిన కోడలితో-

నన్ను గురించి నీవు విని
నావనుకో యెవరైన చెప్పితే
నిన్ను గురించి నేనటుల
నేవినినాసరే.. నీకు నాకు
ధ్యన్నలగాలి తప్ప మన
తప్పులు పెద్దగ చేసి చిన్ని గుం
డెన్నలిపేయరాదు.. మన
డెందములందున ఇంత చేసితే
ఉన్నదివాడె.. వాని సుఖమొక్కటే.


అని తన అమ్మ అనే మాటల్ని కవి లోకోక్తిగా పరిమళింపజేశాడు. తాను 'అమ్మ' స్థాయి నుండి 'అవ్వ' స్థాయికి ఎదిగినట్టు కోడలు మంచి వార్త ఎఱిగించినప్పుడు 'మొక్కుకుంటి'..నన్నవ్వ యటంచు పిల్చు చిరునవ్వుల బుజ్జిని నీవు గర్భమందివ్వమటంచు వెంకడిని.. కాన్పు అయి నీ యొడి గుమ్మడి పండు నెత్తితే మువ్వురు కొండ యెక్కవలె.. ఇది మొక్కు.. అని కోడలితో సంతృప్తి, సంతోషం, గర్వం ముప్పిరిగొనగ పలికింది అమ్మ. ఇది చాలా సహజంగా చెప్పబడింది. తెలుగింట నిత్య సత్యమైన విషయమిది.


జీవించే ప్రతి ప్రాణికి మరణం తప్పదు. మరణం విషాదకరం. అమ్మ మరణం అత్యంత బాధాకరం. గుండె గుడిలో దేవతా రూపమైనిలిచింది. కవి జోస్యం విద్యాసాగర్కలం నుండి అక్షరధారయై వెలసింది. అమ్మ భావం అక్షయధామం.
తల్లి అదెవ్వరైన సరె...

తప్పక ఒక్కతె.. ఆమె మంచిదే.
చల్లనిదే సుధామధుర
పమ్మును గుండెల పిండిచేసి రం
జిల్లగ పంచిపెట్టునదె
చిత్రముగా తన పొట్టచీల్చు జా
బిల్లినె యెత్తి ముద్దుగొను
పిచ్చిదె... వెర్రిదె.. జగమ్ములో.. (పుట.86)
అని జోస్యం విద్యాసాగర్తన కవితా వైభవాన్ని చూసి ఆనందించడానికి ఆశీర్వదించడానికి భౌతికంగా లేని తన మాతృమూర్తి పాదయుగం చెంత సమర్పించి ఆత్మసంతృప్తి పొందారు.

....... ...... .....


తనపేరుతోనూ, ఇంటిపేరులోనూ వెన్నెల్ని, వెల్తురునూ నింపుకొని జ్యోతి చంద్రమౌళి 'సృజన' అనే ఖండకావ్యం రచించారు. అందులో 'అమ్మ' గురించి వ్రాసిన ఖండికలో సరళత్వం అనే వెన్నెలా, సహజత్వం అనే వెల్తురూ కలబోతగా కన్పడ్తాయి.

మంచిమాటలు జెప్పి మమకారమును జూపు
మురిపించి నవ్వించి ముద్దులాడు
చందమామను జూపి చక్కగ పాడుచు
గోరుముద్దలు బెట్టు కూర్మి తోడ
అల్లరి చేసిన ఆత్మీయతను జూపి
ఆలించి లాలించి హత్తుకొనుచు
గుండెలపై దన్ని గుసగుసలాడిన
ఆనందమును జెందు నాత్మలోన
కోపమే రాదు నెప్పుడు కొడుకులందు
తాను తినకున్న తినిపించు తనివి తీర
బిడ్డ శ్రేయస్సు గోరెడి దొడ్డమనసు
అమ్మకే యుండు సాటెవ్వరనియందు

కొడుకు ముఖములోన కోటికాంతులు జూచి
ఆనందమును జెందు నంతలోనె
ముసిముసినవ్వుల ముద్దుముచ్చట జూచి
ముక్కోటి దేవుళ్ళ మ్రొక్కుకొనుచు
యెత్తుకోమని యంచు యేడ్పించుచుండగా
జోకొట్టి లాలించి జోలపాడు
బుడిబుడి నడకల బుజ్జిబాబును జూచి
తనువంత పులకించి తనివి చెందు
అమ్మ మాటలోనె ఆనందమున్నది
అమ్మ ప్రేమలోనె కమ్మదనము
అమ్మ పదములోనె అమృతమున్నది
అమ్మకెవరుసాటి అవని యందు! (పుట.21,22)

అని మాతృమూర్తి మహోన్నతత్వానికి అక్షరాకృతినిచ్చారు.

నేను...

My photo
కేశవ్... ప్రసారభాష పుస్తక రచయిత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్టు పురస్కారగ్రహీత. ప్రస్తుతం సిక్స్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్...